Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్‌ నాశనమైంది'.. ఇర్ఫాన్‌ పఠాన్‌ అదిరిపోయే రిప్లై

Irfan Pathan Reply Fan Dont Blame Anyone Dhoni Reason Early Retirement - Sakshi

స్వింగ్‌ బౌలర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌ అనతి కాలంలోనే స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోనే పఠాన్‌ ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. టి20 వరల్డ్‌కప్‌ 2007 ఫైనల్లో పాకిస్తాన్‌పై మూడు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఇర్ఫాన్‌ పఠాన్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే బౌలర్‌గా జట్టులోకి వచ్చిన పఠాన్‌ను బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా మార్చాలని టీమిండియా ప్రయోగాలు చేసింది. ఆరంభంలో ఇది సూపర్‌ సక్సెస్‌ అయింది.

వన్‌డౌన్‌లో, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్‌ సెంచరీతో పాటు అర్థ సెంచరీల మోత మోగించాడు. కపిల్‌ దేవ్‌ లాంటి మరో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ మనకు దొరికాడని అనుకునేలోపే పఠాన్‌ కెరీర్‌ క్రమంగా మసకబారుతూ వచ్చింది. ఇక ధోని టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాకా ఇర్ఫాన్‌ పఠాన్‌కు జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. వాస్తవానికి ఇక్కడ ధోని చేసిందేం లేదు. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఫామ్‌ కోల్పోవడం వల్ల జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యువ జట్టును తయారు కావాలని భావించాడు.

ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్‌, అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌, యూసఫ్‌ పఠాన్‌లు మెల్లిమెల్లిగా జట్టుకు దూరమయ్యారు. వీరి బాటలోనే ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా వెళ్లాల్సి వచ్చింది.ఇక పఠాన్‌ తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినప్పటికి 2012 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. 27 ఏళ్ల వయసులో చివరిగా భారత జట్టుకి ఆడిన ఇర్ఫాన్ పఠాన్, దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అదరగొడుతున్న ఇర్ఫాన్ పఠాన్ గురించి ఓ క్రికెట్ ఫ్యాన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ కెరీర్‌ నాశనమవ్వడానికి ధోని కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. 

''ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ (ధోనీ), ఆయన మేనేజ్‌మెంట్‌పై మరింత ద్వేషం పెరుగుతుంది. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్‌లో పఠాన్‌ పర్ఫెక్ట్ ప్లేయర్. ఏ టీమ్‌ అయినా ఇలాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది. చివరికి బిన్నీ కూడా'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే అభిమాని ట్వీట్‌పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ చాలా హుందాగా స్పందించాడు. ‘దయచేసి ఎవ్వరిని నిందించొద్దు.. కానీ నీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ కామెంట్ చేశాడు. కాగా అభిమానికి పఠాన్‌ హుందాతనంతో సమాధానం ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

కాగా టీమిండియా తరుపున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్‌లో 100 టెస్టు వికెట్ల ఘనతను సాధించాడు. టీమిండియా తరపున 120 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ 173 వికెట్లు తీయడమే కాకుండా 1544 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్.. బ్యాటుతోను అదరగొట్టాడు. తన ఖాతాలో 12 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో ఒక సెంచరీ ఉంది. ఇక లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రస్తుతం బిల్వారా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చదవండి: 'చీటింగ్‌ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా'

స్టార్‌ క్రికెటర్‌ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top