టీవీకే అధినేత విజయ్, క్రికెటర్ జోఫ్రా ఆర్చర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీహీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ కింగ్ మేకర్‌గా నిలిచారు.
అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ తమిళనాట విజయ్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చక్కర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్’ (అప్పటి ట్విటర్) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్’ అని పోస్టు పెట్టాడు.
నిజానికి ఆర్చర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్‌ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్‌కి సంబంధించినవి మాత్రమే.
అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్‌ను తమ హీరో విజయ్ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.
అయితే ఆర్చర్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్‌తో విభేదాల సమయంలో క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా ఇలాంటి ట్వీట్ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026


