ఐపీఎల్‌ 2020 టైటిల్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌ 11

Dream 11 Has Got IPL 2020 Sponsorship Title - Sakshi

ముంబై : ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్‌షిప్‌ హక్కుల నుంచి వివో తప్పుకున్నప్పటి నుంచి తరువాతి స్పాన్సర్‌ ఎవరా అన్న విషయంపై ఉత్కంఠ వీడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్‌షిప్‌ హక్కులను 250 కోట్ల రూపాయలకు డ్రీమ్‌ 11 కంపెనీ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే డ్రీమ్‌ 11తో పాటు అన్‌ అకాడమీ(రూ. 210 కోట్లు), టాటాసన్స్‌‌ (రూ. 180 కోట్లు), బైజూస్‌ (రూ. 125 కోట్ల)తో బిడ్ వేసి పోటీ పడగా.. 250 కోట్ల రూపాయలతో డ్రీమ్‌11 ఐపీఎల్‌ 2020కి  సంబంధించి స్పాన్సర్‌షిప్‌ హక్కులను పొందింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. చదవండి : ‘సచిన్‌లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’

2018-22 ఏళ్ల మధ్య ఐదేళ్ల కాలానికి గానూ వివో ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గల్వాన్‌ ఘర్షణ అనంతరం చైనాకు చెందిన వస్తువులను బహిష్కరించాలని కేంద్ర ప్రభుత‍్వం తెలపడంతో చైనాకు చెందిన వివో ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. దీంతో ఐపీఎల్ 2020కి సంబంధించి కొత్త స్పాన్సర్‌ ఎవరు వస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం రిలయన్స్‌ జియో, బైజూస్, టాటాసన్స్‌, అన్‌ అకాడమీ, డ్రీమ్‌ 11 వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు 250 కోట్ల రూపాయలతో డ్రీమ్‌11 మూడు నెలల కాలానికి గానూ ఐపీఎల్‌ 2020 స్పాన్సర్‌షిప్‌ హక్కులను పొందింది. కాగా ఇదే డ్రీమ్‌ 11కు గతంలో 2018లో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కాగా దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ షురూ కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top