Sakshi News home page

Mayank Agarwal: రెచ్చిపోయిన మయాంక్‌ అగర్వాల్‌.. సత్తా చాటిన సాయి సుదర్శన్‌

Published Sun, Jul 30 2023 5:04 PM

Deodhar Trophy 2023: Mayank Agarwal Continuous Form, As South Zone Beat East Zone By 5 Wickets - Sakshi

దియోదర్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలు  సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్‌.. ఇవాళ (జులై 30)  ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్‌) ఇరగదీశాడు. మయాంక్‌కు ఐపీఎల్‌ హీరో సాయి సుదర్శన్‌ (53) తోడవ్వడంతో ఈస్ట్‌ జోన్‌పై సౌత్‌ జోన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ జోన్‌.. కౌశిక్‌ (8-1-37-3), సాయి కిషోర్‌ (10-0-45-3), విధ్వత్‌ కావేరప్ప (9-2-40-2), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (1/62), వాషింగ్టన్‌ సుందర్‌ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్‌ విరాట్‌ సింగ్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్‌ ఆటగాళ్లు ఆకాశదీప్‌ సింగ్‌ (44), ముక్తర్‌ హుస్సేన్‌ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్‌ (12), రియాన్‌ పరాగ్‌ (13) చేతులెత్తేశారు.

అనంతరం​ బరిలోకి దిగిన సౌత్‌ జోన్‌.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్‌ అగర్వాల్‌, సాయి సుదర్శన్‌ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్‌ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ రోహన్‌ కున్నుమ్మల్‌ (18), అరుణ్‌ కార్తీక్‌ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్‌ రాయుడు (24 నాటౌట్‌).. వాషింగ్టన్‌ సుందర్‌ (8 నాటౌట్‌) సాయంతో సౌత్‌ జోన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో అవినోవ్‌ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్‌ దీప్‌, రియాన్‌ పరాగ్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై సెంట్రల్‌ జోన్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌.. సర్వటే (10-2-19-3), యశ్‌ కొఠారీ (2-1-4-2), సరాన్ష్‌ జైన్‌ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్‌ కాగా.. శివమ్‌ చౌదరీ (85 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్‌ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్‌ జోన్‌ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

Advertisement

What’s your opinion

Advertisement