IPL 2021: సన్‌రైజర్స్‌ అవుట్‌!

Delhi Capitals thrash Sunrisers Hyderabad by 8 wickets - Sakshi

లీగ్‌లో ఏడో ఓటమి

8 వికెట్లతో ఢిల్లీ ఘనవిజయం

రాణించిన అయ్యర్, ధావన్‌

హైదరాబాద్‌ ఆట ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా ఇంటి బాట పట్టే విధంగా తయారైంది. ఇప్పటిదాకా ఒక్కటే గెలిచిన జట్టు  ఏకంగా ఏడింట ఓడి దాదాపుగా లీగ్‌ నుంచి ని్రష్కమించినట్లే! మరో వైపు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘనవిజయం సాధించి మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బౌలింగ్‌లో నోర్జే, రబడా  బ్యాటింగ్‌లో ధావన్, అయ్యర్‌ రాణించి జట్టును గెలిపించారు.

దుబాయ్‌: తీరు మార్చుకోని సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదు. దేశం మారినా ఈ ఫ్రాంచైజీ దశ మారట్లేదు. ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితిలోనూ ఆ తీవ్రత కనబర్చలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

అబ్దుల్‌ సమద్‌ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగతా బ్యాట్స్‌మెన్‌ను ఢిల్లీ బౌలర్లు తేలిగ్గానే కట్టడి చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నోర్జే (2/12) కీలక వికెట్లను పడగొట్టగా, రబడాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్‌ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌), పంత్‌ (21 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)  రాణించారు.  

వార్నర్‌ డకౌట్‌
హైదరాబాద్‌ ఆట ఆరంభించగానే పరుగుకు ముందే కష్టాలెదురొచ్చాయి. వార్నర్‌ (0) డకౌటయ్యాడు. నోర్జే బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్‌... అక్షర్‌ పటేల్‌కు సులువైన క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. కెపె్టన్‌ విలియమ్సన్‌ (18; 1 ఫోర్‌) వచ్చీ రాగానే బౌండరీ బాదాడు. అప్పటికే రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్‌ సాహా (17 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రబడా బౌలింగ్‌కు దిగితే భారీ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికే ఔటయ్యాడు. తర్వాత మెరుపుల్లేని ఆట పేలవంగా సాగిపోయింది.

రిషభ్‌ పంత్, పృథ్వీ షా క్యాచ్‌లు జారవిడవడంతో రెండు సార్లు లైఫ్‌లు పొందినా కెప్టెన్‌ విలియమ్సన్‌ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మనీశ్‌ పాండే (17; 1 ఫోర్‌), కేదార్‌ జాదవ్‌ (3)లు జట్టును గట్టెక్కించలేకపోయారు. దీంతో 90 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అబ్దుల్‌ సమద్‌ ఇన్నింగ్స్‌లో అందరికంటే ఎక్కువగా చేసిన పరుగులు, రషీద్‌ ఖాన్‌ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆడిన తీరుతో సన్‌రైజర్స్‌ పరువు నిలిచే స్కోరు చేయగలిగింది. అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశాడు.  

ధావన్‌ పరిచిన బాటలో...
కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చక్కని బాట వేశాడు. పృథ్వీ షా (11) విఫలమైనా... శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. శిఖర్‌ ఔటయ్యాక మిగతా బాధ్యతల్ని అయ్యర్, కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ పంచుకున్నారు. అజేయంగానే మిగిలిపోయిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో భువనేశ్వర్‌ వేసిన 16వ ఓవర్లో, ఖలీల్‌ 17వ ఓవర్లో రిషభ్‌ పంత్‌ చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. హోల్డర్‌ 18వ ఓవర్లో భారీ సిక్సర్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాచ్‌ను ముగించాడు. అబేధ్యమైన మూడో వికెట్‌కు పంత్, అయ్యర్‌ 67 పరుగులు జోడించారు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) అక్షర్‌ (బి) నోర్జే 0; సాహా (సి) ధావన్‌ (బి) రబడా 18; విలియమ్సన్‌ (సి) హెట్‌మైర్‌ (బి) అక్షర్‌ 18; పాండే (సి) అండ్‌ (బి) రబడా 17; కేదార్‌ (ఎల్బీ) (బి) నోర్జే 3, సమద్‌ (సి) పంత్‌ (బి) రబడా 28; హోల్డర్‌ (సి) పృథ్వీ షా (బి) అక్షర్‌ 10; రషీద్‌ఖాన్‌ రనౌట్‌ 22; భువనేశ్వర్‌ నాటౌట్‌ 5; సందీప్‌ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134.

వికెట్ల పతనం: 1–0, 2–29, 3–60, 4–61, 5–74, 6–90, 7–115, 8–133, 9–134.
బౌలింగ్‌: నోర్జే 4–0–12–2, అవేశ్‌ఖాన్‌ 4–0–27–0, అక్షర్‌ పటేల్‌ 4–0–21–2, రబడా 4–0–37–3, స్టొయినిస్‌ 1.1–0–8–0, అశ్విన్‌ 2.5–0–22–0.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) విలియమ్సన్‌ (బి) అహ్మద్‌ 11; ధావన్‌ (సి) అబ్దుల్‌ సమద్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 42; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 47; పంత్‌ నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1–20, 2–72.
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–33–1, భువనేశ్వర్‌ 3–0–21–0, హోల్డర్‌ 3.5–0–33–0, రషీద్‌ ఖాన్‌ 4–0–26–1, సందీప్‌ శర్మ 3–0–26–0.  
 

ఐపీఎల్‌లో నేడు
ముంబై X కోల్‌కతా
వేదిక: అబుదాబి; రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top