ఢిల్లీని గట్టెక్కించిన ఇషాంత్‌ 

Delhi Capitals defeated Gujarat Titans by 5 runs  - Sakshi

గుజరాత్‌పై 5 పరుగులతో గెలుపు

షమీ బుల్లెట్‌ బౌలింగ్‌ వృథా

క్యాపిటల్స్‌ను ఆదుకున్న అమన్‌ 

అహ్మదాబాద్‌: తక్కువ స్కోర్లేగా... తుక్కుతుక్కు కింద కొట్టేస్తామంటే కుదరదు! ఎందుకంటే ఈ సీజన్‌లో తక్కువ స్కోర్ల మ్యాచ్‌లే ఆఖర్లో ఎక్కువ ఉత్కంఠ రేపుతున్నాయి. అలాంటి రసవత్తర పోరులో ఢిల్లీని ఆఖరి ఓవర్‌తో ఇషాంత్‌ శర్మ (2/23)) గెలిపించాడు. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ సొంతగడ్డపై 5 పరుగుల తేడాతో ఓడింది.

ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్‌ హకీమ్‌ (44 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, రిపాల్‌ పటేల్‌ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షమీ (4/11) అదరగొట్టాడు. తర్వాత గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడింది. హార్దిక్‌ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.  

షమీ నిప్పులు చెరగడంతో... 
వెటరన్‌ సీమర్‌ షమీ నిప్పులు చెరగడంతో ఢిల్లీ బ్యాటర్లు హడలెత్తారు. ఒకదశలో 5 ఓవర్లకే 23 పరుగుల వద్ద సగం వికెట్లు కూలడంతో ఢిల్లీ 10, 12 ఓవర్లయినా ఆడుతుందా అనే సందేహం కలిగింది. అంతలా అతని పేస్‌ పదును క్యాపిటల్స్‌ను దెబ్బ తీసింది.

ఇన్నింగ్స్‌ తొలి బంతికే సాల్ట్‌ (0)ను డకౌట్‌ చేసిన షమీ తన వరుస ఓవర్లలో రోసో (8), మనీశ్‌ పాండే (1), ప్రియమ్‌ గార్గ్‌ (10)లను అవుట్‌ చేశాడు. ఈ దశలో ఢిల్లీని అమన్‌ హకీమ్, అక్షర్‌ పటేల్‌ (30 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. అక్షర్‌ అవుటయ్యాక అమన్‌ నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించడంతో ఢిల్లీ వంద పైచిలుకు స్కోరు చేసింది. 

పాండ్యా ఆఖరిదాకా ఉన్నా... 
అచ్చూ ఢిల్లీలాగే... టైటాన్స్‌ కూడా ప్రధాన బ్యాటర్లు సాహా (0), గిల్‌ (6), విజయ్‌ శంకర్‌ (6), మిల్లర్‌ (0)లను ఆరంభంలోనే కోల్పోయింది. 32/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న గుజరాత్‌ను మనోహర్‌ (33 బంతుల్లో 26; 1 సిక్స్‌) అండతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నిలబెట్టాడు.

కానీ ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌కు 12 బంతుల్లో 33 పరుగుల సమీకరణం కష్టమైంది. అయితే 19వ ఓవర్లో తెవాటియా (7 బంతుల్లో 20; 3 సిక్సర్లు) హ్యాట్రిక్‌ సిక్సర్లు గుజరాత్‌ను విజయం వైపునకు తీసుకెళ్లాయి. 6 బంతులకు 12 పరుగులు కావాల్సి ఉండగా... ఇషాంత్‌ ప్రమాదకరమైన తెవాటియాను అవుట్‌ చేసి 6 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీకి పోయిన ప్రాణం తిరిగొచ్చింది. 

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) మిల్లర్‌ (బి) షమీ 0; వార్నర్‌ (రనౌట్‌) 2; ప్రియమ్‌ (సి) సాహా (బి) షమీ 10; రోసో (సి) సాహా (బి) షమీ 8; పాండే (సి) సాహా (బి) షమీ 1; అక్షర్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 27; అమన్‌ హకీమ్‌ (సి) మనోహర్‌ (బి) రషీద్‌ 51; రిపాల్‌ (సి) పాండ్యా (బి) మోహిత్‌ 23; నోర్జే (నాటౌట్‌) 3; కుల్దీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం ( 20 ఓవర్లలో 8 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–16, 4–22, 4–23, 6–73, 7–126, 8–130. బౌలింగ్‌: షమీ 4–0–11–4, హార్దిక్‌ 1–0–10–0, జోష్‌ లిటిల్‌ 3–0–27–0, రషీద్‌ 4–0–28–1, నూర్‌ అహ్మద్‌ 4–0–20–0, మోహిత్‌ శర్మ 4–0–33–2.  

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: వృద్ధిమాన్‌ సాహా (సి) సాల్ట్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 0; శుబ్‌మన్‌ గిల్‌ (సి) మనీశ్‌ పాండే (బి) నోర్జే 6; హార్దిక్‌ 
పాండ్యా (నాటౌట్‌) 59; విజయ్‌ శంకర్‌ (బి) ఇషాంత్‌ శర్మ 6; డేవిడ్‌ మిల్లర్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 0; అభినవ్‌ మనోహర్‌ (సి) అమన్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 26; తెవాటియా (సి) రోసో (బి) ఇషాంత్‌ శర్మ 20; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 125. 
వికెట్ల పతనం: 1–0, 2–18, 3–26, 4–32, 5–94, 6–122. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–1–24–2, ఇషాంత్‌ శర్మ 4–0–23–2, నోర్జే 4–0–39–1, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–15–1, అక్షర్‌ పటేల్‌ 4–0–24–0.  

ఐపీఎల్‌లో నేడు 
లక్నో VS  చెన్నై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) 
పంజాబ్‌ VS ముంబై (రాత్రి గం. 7:30 నుంచి) 

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top