Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు'

Cristiano Ronaldo struggling Find Master-Chef New House-Huge Salary - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానులు ఎక్కువ. గతేడాది ఖతర్‌ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్‌ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికి రొనాల్డోకు క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా, వ్యక్తిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలాంటి రొనాల్డో ఇప్పుడు ఒక మంచి వంటవాడి కోసం ఎదురుచూస్తున్నాడు.  భారీగా జీతం ఇస్తానని చెప్పినా ఎవరూ దొరకడం లేదని రొనాల్డో తెగ బాధపడుతున్నాడు.

పోర్చుగల్ లోని క్వింటా డాలో రొనాల్డో రూ.170 కోట్లతో ఓ కళ్లు చెదిరే భవంతిని కట్టిస్తున్నాడు.ఈ ఏడాది జూన్ వరకూ ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత భార్య జార్జినా రోడ్రిగెజ్, పిల్లలతో కలిసి రొనాల్డో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో భావించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తోపాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్‌ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. వంట పని చేసే వ్యక్తికి నెలకు సుమారు 4500 పౌండ్లు(సుమారు రూ.4.5 లక్షలు) జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు.

ఈ మధ్యనే రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల పాటు భారీ డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా గురువారం అర్థరాత్రి సౌదీ అరేబియాలో పారిస్‌ సెయింట్స్‌ జర్మన్‌(పీఎస్‌జీ)తో రొనాల్డో జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ 5-4 తేడాతో గెలుపొందింది. పీఎస్‌జీ జట్టులో మెస్సీ సహా బ్రెజిల్‌ స్టార్‌ నెయమర్‌, ఫ్రాన్స్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. కాగా మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న రొనాల్డో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్‌ ఫుట్‌బాలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top