పంజాబ్‌ ఆశలు గల్లంతు

Chennai Super Kings beat Kings XI Punjab by 9 wickets - Sakshi

చివరి అవకాశం వృథా

9 వికెట్లతో చెన్నై చేతిలో ఓటమి

రుతురాజ్‌ అర్ధ సెంచరీ

ప్లే ఆఫ్స్‌కు దూరమైన కింగ్స్‌ ఎలెవన్‌

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ స్థానం ఊరిస్తున్న వేళ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఉసూరుమనిపించింది... గెలిస్తే మెరుగైన స్థితికి చేరి ముందంజ వేసే అవకాశం ఉన్నా, పేలవ ప్రదర్శనతో చేజేతులా ఓటమి తెచ్చి పెట్టుకుంది. ఐదు వరుస విజయాలతో ఒక్కసారిగా జూలు విదిల్చినట్లు కనిపించిన ఆ జట్టు, బ్యాటింగ్‌ వైఫల్యంతో వరుసగా రెండో మ్యాచ్‌ ఓడి నిష్క్రమించింది. లీగ్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని జట్ల జాబితాలో ఉన్న ఈ టీమ్, మళ్లీ అదే నిరాశతో సీజన్‌ను ముగించింది. మరో వైపు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన తర్వాత గత రెండు మ్యాచ్‌లలో బెంగళూరు, కోల్‌కతా జట్ల లెక్కలు మార్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో జట్టును దెబ్బ కొట్టి తమతో పాటు తీసుకెళ్లింది. ‘హ్యాట్రిక్‌’ విజయాలు సాధించి కొంత సంతృప్తితో ధోని సేన తమ ఆటను ముగించింది.

అబుబాది:  ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్లతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు సాధించింది. దీపక్‌ హుడా (30 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్‌ రాహుల్‌ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లుంగి ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (49 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హ్యాట్రిక్‌ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (30; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు.

హుడా మినహా...
తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలతో మయాంక్‌ జోరు కనబరచగా, ఆ తర్వాత సిక్సర్‌తో రాహుల్‌ అలరించాడు. మరో మూడు బౌండరీలు బాదిన మయాంక్‌ను అద్భుత బంతితో ఇన్‌గిడి పెవిలియన్‌ చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్‌ 53/1తో నిలిచింది. కాసేపటికే రాహుల్‌ కూడా ఇన్‌గిడికే దొరికిపోయాడు. భారీ హిట్టర్లు గేల్‌ (12), పూరన్‌ (2)ను చెన్నై బౌలర్లు సమర్థంగా నిలువరించారు. నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్‌ చేసి చెన్నై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. అయితే మరో ఎండ్‌నుంచి దీపక్‌ హుడా ఎదురుదాడికి దిగాడు.  మన్‌దీప్‌ (14)తో ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించి జట్టు స్కోరు 100 పరుగులు దాటించాడు. ఇన్‌గిడి ఓవర్లో రెండు సిక్సర్లతో 18 పరుగులు పిండుకున్నాడు. తర్వాత మరో ఫోర్‌ బాదిన అతను 26 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అదే జోరులో 4, 6తో చివరి ఓవర్లో 14 పరుగులు రాబట్టాడు. అతని ధాటికి పంజాబ్‌ చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేసింది.
ఆడుతూ పాడుతూ...
సాధారణ లక్ష్యఛేదనను చెన్నై దూకుడుగా ప్రారంభించింది. డుప్లెసిస్, గైక్వాడ్‌ అంచనాలకు తగినట్లు ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు సాధించింది. తర్వాత కూడా నింపాదిగా ఆడుతోన్న ఈ జోడీని డుప్లెసిస్‌ను అవుట్‌ చేయడం ద్వారా జోర్డాన్‌ విడదీశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 బంతుల్లో 82 పరుగుల్ని జోడించారు. తర్వాత రాయుడు సహకారంతో రుతురాజ్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో బౌండరీతో 38 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. అదే జోరులో వీరిద్దరూ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.

స్కోరు వివరాలు
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) ఇన్‌గిడి 29; మయాంక్‌ (బి) ఇన్‌గిడి 26; గేల్‌ (ఎల్బీ) (బి) తాహిర్‌ 12; పూరన్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 2; మన్‌దీప్‌ (బి) జడేజా 14; హుడా (నాటౌట్‌) 62; నీషమ్‌ (సి) రుతురాజ్‌ (బి) ఇన్‌గిడి 2; జోర్డాన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 2;
మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1–48, 2–62, 3–68, 4–72, 5–108, 6–113.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–30–0, స్యామ్‌ కరన్‌ 2–0–15–0, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–27–1, ఇన్‌గిడి 4–0–39–3, తాహిర్‌ 4–0–24–1, జడేజా 3–0–17–1

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (నాటౌట్‌) 62; డుప్లెసిస్‌ (సి) రాహుల్‌ (బి) జోర్డాన్‌ 48; రాయుడు (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 14;
మొత్తం (18.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 154.
వికెట్ల పతనం: 1–82.  
బౌలింగ్‌: నీషమ్‌ 3–0–26–0, షమీ 4–0–29–0, జోర్డాన్‌ 3–0–31–1, రవి బిష్ణోయ్‌ 4–0–39–0, మురుగన్‌ అశ్విన్‌ 4–0–17–0, గేల్‌ 0.5–0–5–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top