సన్‌రైజర్స్‌ అదరహో | Chennai lost to Sunrisers Hyderabad by 10 runs | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ అదరహో

Apr 19 2026 5:08 AM | Updated on Apr 19 2026 5:08 AM

Chennai lost to Sunrisers Hyderabad by 10 runs

ఉప్పల్‌లో వరుసగా రెండో విజయం 

10 పరుగుల తేడాతో ఓడిన చెన్నై

అభిషేక్, క్లాసెన్‌ అర్ధసెంచరీలు 

రాణించిన మలింగ, నితీశ్‌ రెడ్డి

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఆయుశ్‌ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్‌ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్‌ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్‌ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్‌ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది.  

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్లాసెన్‌ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్‌ కంబోజ్, ఒవర్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్‌ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్‌ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా, ఇషాన్‌ మలింగకు 3 వికెట్లు... నితీశ్‌ కుమార్‌ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్‌ హింగే 7 పరుగులే ఇచ్చాడు.   

కెప్టెన్‌ విఫలం... 
షార్ట్‌ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్‌ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్‌ బాదిన అభిషేక్‌... కంబోజ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్‌లో ముకేశ్‌ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్‌ హెడ్‌ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 

హెడ్‌ను అవుట్‌ చేసిన ముకేశ్‌ తర్వాతి బంతికే కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్‌ కూడా తీయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్‌ తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్‌ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. 

మరోవైపు అనికేత్‌ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్‌లో గత రెండు మ్యాచ్‌లలో రాణించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (12; 1 సిక్స్‌) ఈసారి విఫలమయ్యాడు. నూర్‌ అహ్మద్‌ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన క్లాసెన్‌ 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్‌ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది.  

మాత్రే మినహా... 
ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్‌ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను క్లాసెన్‌ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్‌ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్‌ అద్భుత క్యాచ్‌తో మాత్రే ఇన్నింగ్స్‌ ముగియగా, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (19) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. పవర్‌ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. 

ఆ తర్వాత ఒక్క బ్యాటర్‌ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్‌ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్‌ మెరుగైన బౌలింగ్‌తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్‌ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్‌ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి.  

స్కోరు వివరాలు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) సామ్సన్‌ (బి) ఒవర్టన్‌ 59; హెడ్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 23; ఇషాన్‌ కిషన్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 0; క్లాసెన్‌ (బి) కంబోజ్‌ 59; అనికేత్‌ (సి) నూర్‌ (బి) ఒవర్టన్‌ 2; నితీశ్‌ రెడ్డి (సి) షార్ట్‌ (బి) ఒవర్టన్‌ 12; అరోరా (సి) బ్రెవిస్‌ (బి) గుర్‌జప్‌నీత్‌ 13; లివింగ్‌స్టోన్‌ (సి) బ్రెవిస్‌ (బి) కంబోజ్‌ 1; శివాంగ్‌ (సి) గుర్‌జప్‌నీత్‌ (బి) కంబోజ్‌ 12; హింగే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్‌: షార్ట్‌ 3–0–38–0, ముకేశ్‌ చౌదరి 2–0–21–2, కంబోజ్‌ 3–0–22–3, నూర్‌ 4–0–33–0, ఒవర్టన్‌ 4–0–37–3, గుర్‌జప్‌నీత్‌ 4–0–34–1. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 7; రుతురాజ్‌ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 30; షార్ట్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 34; సర్ఫరాజ్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 0; దూబే (బి) సాకిబ్‌ 21; ఒవర్టన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హింగే 16; కంబోజ్‌ (నాటౌట్‌) 13; నూర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్‌: ప్రఫుల్‌ హింగే 4–0–60–1, నితీశ్‌  రెడ్డి 4–0–31–2, సాకిబ్‌ 4–0–32–1, ఇషాన్‌ మలింగ 4–0–29–3, శివాంగ్‌ 3–0–18–1, అభిషేక్‌ 1–0–13–0.

షార్ట్‌పై అభిషేక్‌ దాడి... 
ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన మాథ్యూ షార్ట్‌ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్‌ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్‌ తానేంటో షార్ట్‌కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్‌ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. 

తొలి బంతికి హెడ్‌ సింగిల్‌ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్‌ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్‌ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.

ధోని ఆడలేదు... 
భారత స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్‌లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. 

అయితే మరోసారి ధోని పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. 2025 సీజన్‌ షెడ్యూల్‌లో భాగంగా ఉప్పల్‌లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్‌ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్‌ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్‌లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు!   

Advertisement
 
Advertisement
Advertisement