నేనే కెప్టెన్సీ వద్దన్నాను: బుమ్రా | Bumrah gives clarity on captaincy | Sakshi
Sakshi News home page

నేనే కెప్టెన్సీ వద్దన్నాను: బుమ్రా

Jun 18 2025 1:13 AM | Updated on Jun 18 2025 1:13 AM

Bumrah gives clarity on captaincy

లండన్‌: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటన తర్వాత భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసినప్పుడు క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చ సాగింది. అనుభవజ్ఞుడు, జట్టు ప్రధాన బలమైన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాకుండా గిల్‌ను సారథిగా ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. దీనిపై ఇప్పుడు బుమ్రా స్పష్టత  ఇచ్చాడు. తన గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కెప్టెన్సీవంటి అదనపు భారం మోయలేనని, నాయకుడిగా తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తానే చెప్పినట్లు అతను వెల్లడించాడు. 

‘నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనక ఎలాంటి ఆసక్తికర నేపథ్యం కానీ, నన్ను కావాలని తప్పించారనే వివాదం కానీ ఏమీ లేదు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్‌లకంటే ముందే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నా పని భారం ఎలా ఉండబోతోందో అనే విషయంపై బీసీసీఐ అధికారులతో పాటు నా వెన్ను నొప్పికి చికిత్స చేసిన వైద్యులతో కూడా మాట్లాడాను. జాగ్రత్త పాటిస్తేనే మంచిదని చెప్పారు. దాంతో నేను ఇంగ్లండ్‌లో అన్ని టెస్టులూ ఆడలేనని, సారథిగా నా పేరును పరిగణనలోకి తీసుకోవద్దని బోర్డుకు చెప్పాను. 

సిరీస్‌ మధ్యలో నేను తప్పుకొని మరొకరు కెప్టెన్సీ చేయడం సరైంది కాదు. కాబట్టి జట్టు ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నా. భారత కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. కానీ కెప్టెన్‌గాకంటే ఒక ప్లేయర్‌గా నేను జట్టు కోసం ఉపయోగపడటం ముఖ్యమని భావించా’ అని బుమ్రా తెలిపాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement