ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ వారిదే: బ్రెట్‌ లీ | Brett Lee Picks The Winner Of IPL 2020 | Sakshi
Sakshi News home page

ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ వారిదే: బ్రెట్‌ లీ

Published Thu, Sep 10 2020 10:32 AM | Last Updated on Sat, Sep 19 2020 3:34 PM

Brett Lee Picks The Winner Of IPL 2020 - Sakshi

ముంబై:  గతేడాది జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించి టైటిల్‌ ఎగురేసుకుపోయింది. దాంతో ముంబై ఖాతాలో నాల్గోసారి టైటిల్‌ చేరగా, మరొకసారి టైటిల్‌ సాధించాలన్న సీఎస్‌కే ఆశలకు గండిపడింది. కాగా, ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎస్‌కేను కైవసం చేసుకుంటుందని ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ కవరేజ్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్‌ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్‌ లీ.. ప్రస్తుతం ముంబైకు చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు బ్రెట్‌లీ సమాధానమిచ్చాడు. ‘ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ ఎవరదని భావిస్తున్నారు’ అని అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే అని చెప్పాడు. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం సీఎస్‌కేనే టైటిల్‌ గెలుస్తుందని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఈసారి ఫైనల్‌-4లో కేకేఆర్‌ కచ్చితంగా ఉంటుందన్నాడు. గతంలో కేకేఆర్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల తరఫున బ్రెట్‌ లీ ఆడాడు. (చదవండి: రంగంలోకి సౌరవ్‌ గంగూలీ)

కొన్ని రోజుల క్రితం సీఎస్‌కే జట్టు సభ్యుడు, వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా అర్థాంతరంగా దుబాయ్‌ నుంచి స్వదేశానికి వచ్చేశాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం ఎంతో ఉత్సాహంగా యూఏఈకి చేరిన రైనా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం ఒకటైతే, ఇలా సీఎస్‌కే వీడి రావడం రెండోది. రైనా తొలి నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కల్గించకపోయినా రెండో నిర్ణయంతో అటు సీఎస్‌కేతో పాటు ఇటు అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడితే రూ. 12.5 కోట్లను తన అకౌంట్‌లో వేసుకునే రైనా.. ఇలా ఉన్నపళంగా ఎందుకు వచ్చేశాడనే దానిపై భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. ఏది ఏమైనా ఇక రైనా తిరిగి సీఎస్‌కేతో చేరడం కష్టమే కావచ్చు. సరైన కారణాలు లేకుండా భారత్‌కు వచ్చేయడమే ఇందుకు కారణం. తాను అవకాశం ఉంటే  మళ్లీ జట్టుతో చేరతానని రైనా తెలిపినా, సీఎస్‌కే యాజమాన్యం అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రైనా లేకపోతే సీఎస్‌కే బలహీనపడే అవకాశం కూడా ఉంది. సీఎస్‌కే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రైనా కీలక ఆటగాడు కావడంతో ఆ లోటును ఎవరితో పూడ్చాలనే దానిపై సీఎస్‌కే కసరత్తులు చేస్తోంది. (చదవండి: టీ20ల్లో మలాన్‌ నంబర్‌వన్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement