ఇటు భువనేశ్వర్‌...అటు అమిత్‌ మిశ్రా

Bhuvneshwar Kumar And Amit Mishra Ruled Out of Season Due to Injuries - Sakshi

గాయాలతో ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించిన బౌలర్లు

సన్‌రైజర్స్, క్యాపిటల్స్‌కు దెబ్బ

దుబాయ్‌: ఐపీఎల్‌లో ఇప్పటికే తడబడుతూ ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌ ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్‌ ఇక ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. అది గ్రేడ్‌–2 లేదా గ్రేడ్‌–3 స్థాయి గాయం కావచ్చు. దీని వల్ల కనీసం 6–8 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లేనట్లే’ అని ఆయన వెల్లడించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ భువనేశ్వర్‌కు గాయమైంది. అతని తొడ కండరాలు పట్టేయడంతో ఒక బంతి మాత్రమే వేసి తప్పుకున్నాడు. ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టిపడేయడంతో పాటు డెత్‌ ఓవర్లలో కూడా పరుగులు నియంత్రించగల, అనుభవజ్ఞుడైన భువీ దూరం కావడం హైదరాబాద్‌ టీమ్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లలో 3 వికెట్లే తీసినా... కేవలం 6.8 ఎకానమీతో  పరుగులివ్వడం భువీ విలువేమిటో చూపిస్తుంది.  

ఢిల్లీకి సమస్యే...
సీనియర్‌ లెగ్‌స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అమిత్‌ మిశ్రా కూడా చేతి వేలికి గాయంతో లీగ్‌ నుంచి నిష్క్రమించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రాణా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకునే క్రమంలో  మిశ్రాకు గాయమైంది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి కీలకమైన గిల్‌ వికెట్‌ తీసిన అతనికి మ్యాచ్‌ తర్వాత పరీక్షలు నిర్వహించగా వేలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. తాజా పరిణామం పట్ల తాము తీవ్రంగా నిరాశ చెందుతున్నామని క్యాపిటల్స్‌ యాజమాన్యం పేర్కొంది.  ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ (170) తర్వాత మిశ్రా (160) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిశ్రా దూరమైన నేపథ్యంలో మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి రావచ్చు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top