అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.
అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా ఈ బరోడా ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.
టీమిండియాలోకి అర్షద్?
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు సంచలన విజయాన్ని అందించాడు.
ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్‌లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్‌తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్‌కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం


