'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా? | BCCI advised to prepare Vaibhav Sooryavanshi for failure by Indias World Cup-winning coach | Sakshi
Sakshi News home page

'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?

Jun 18 2026 8:16 PM | Updated on Jun 18 2026 8:55 PM

BCCI advised to prepare Vaibhav Sooryavanshi for failure by Indias World Cup-winning coach

టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కార‌ణం.

అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యాల‌నే చూసిన వైభ‌వ్.. కొన్ని సంద‌ర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భార‌త జ‌ట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా త‌న సేవ‌ల‌ను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయ‌న‌దే కీల‌క పాత్ర‌.

"వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్ప‌టికే మైదానంలో చాలా సార్లు త‌న‌ స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట స‌మ‌యాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అత‌డికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయ‌ర్ కూడా త‌న కెరీర్ అంత‌టా ఒకే విధ‌మైన ఫామ్‌ను కొన‌సాగించ‌లేడ‌నే విష‌యాన్ని వైభ‌వ్ గ్ర‌హించాలి. 

అతడు ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే..  తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. 

ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్‌ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్‌ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్‌.

ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.

అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు
గత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్‌లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు.  వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. 

దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. 

ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. 

ముఖ్యంగా ఫెయిలూర్స్‌ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌ను కేవలం టెక్నికల్‌గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement