
ఆసియాకప్-2022కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ సోహన్ గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. కాగా జింబాబ్వేతో రెండో టీ20లో కెప్టెన్‌గా వ్యవహరించిన నూరుల్ హసన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు జింబాబ్వేతో అఖరి టీ20తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
అతడి స్థానంలో అఖరి టీ20కు మోసద్దేక్ హుస్సేన్ బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు. కాగా ఈ సిరీస్‌లో గాయపడిన నూరుల్ హాసన్ నేరుగా జింబాబ్వే నుంచి సింగపూర్‌కు చేరుకున్నాడు. సింగపూర్‌లో అతడు తన చేతి వేలుకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
"సోమవారం(ఆగస్టు 8) సింగపూర్‌లోని రాఫెల్స్ హాస్పిటల్‌లో సోహన్ ఎడమ చేతి చూపుడు వేలికి సర్జరీ నిర్వహించడం జరిగింది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది" అని బీసీబీ చీఫ్ ఫిజీషియన్ దేబాశిష్ చౌదరి పేర్కొన్నాడు.
మరోవైపు జింబాబ్వేతో తొలి వన్డేలో గాయపడిన బంగ్లా స్టార్ వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఆసియా కప్‌కు తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్-20022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనుంది.
చదవండి: Asia Cup 2022: పాక్ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి