
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది.
కాగా, టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది.