
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
బంగ్లాదేశ్‌కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్‌గా లిట్టన్ దాస్‌కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
లిట్టన్ గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్‌లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు.
షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్‌కు సునాయాస విజయాన్నందించాడు.
ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్‌కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు.