మొదటి రోజు పేసర్ల హవా | Australia all out for 212 in their first innings | Sakshi
Sakshi News home page

మొదటి రోజు పేసర్ల హవా

Jun 12 2025 1:32 AM | Updated on Jun 12 2025 5:21 AM

Australia all out for 212 in their first innings

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 ఆలౌట్‌ 

స్మిత్, వెబ్‌స్టర్‌ అర్ధ శతకాలు 

రబాడకు ఐదు వికెట్లు 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 43/4 

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

సుదీర్ఘ ఫార్మాట్‌లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్‌ వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్‌పై పేసర్‌ రబాడ విజృంభించినా... ఆసీస్‌ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ తడబడింది. రెండో రోజు తొలి సెషన్‌లో కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది

లండన్‌: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్‌ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 

బ్యూ వెబ్‌స్టర్‌ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. 

కెప్టెన్‌ తెంబా బవుమా (3 బ్యాటింగ్‌)తో పాటు డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 2... హాజల్‌వుడ్, కమిన్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. 

రబాడ పేస్‌ దాడి.. 
ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్‌ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్‌ బాట పట్టించాడు. అదే ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్‌ (4) కూడా అవుటయ్యాడు. 

మార్క్‌రమ్‌ స్లిప్స్‌లో చక్కటి క్యాచ్‌తో గ్రీన్‌ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్‌ (56 బంతుల్లో 17)ను యాన్సెన్‌ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్‌ హెడ్‌ (11) కీపర్‌ వెరీన్‌ పట్టిన ఒంటి చేతి క్యాచ్‌తో పెవిలియన్‌ చేరుకున్నాడు. దీంతో ఆసీస్‌ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్‌ తన అనుభవాన్ని చూపించాడు. 

పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్‌రమ్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు అతడు అవుట్‌ కాగా... కేశవ్‌ మహరాజ్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలో అలెక్స్‌ కేరీ (23) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన వెబ్‌స్టర్‌ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది.  

బెంబేలెత్తించిన పేస్‌ త్రయం...  
దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్‌పై ఆసీస్‌ పేస్‌ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్‌ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్‌ తొలి ఓవర్‌ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్‌రమ్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరగా... కాసేపటికి రికెల్టన్‌ (16) కూడా అతడిని అనుసరించాడు. 

ఆసీస్‌ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్‌ తీసిన ముల్డర్‌ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్‌ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 

4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను అలెన్‌ డొనాల్డ్‌ (330)ను అధిగమించగా...టాప్‌–3లో వరుసగా డేల్‌ స్టెయిన్‌ (439, షాన్‌ పొలాక్‌ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు.  

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: ఖ్వాజా (సి) బెడింగ్‌హామ్‌ (బి) రబాడ 0; లబుషేన్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 17; గ్రీన్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) రబాడ 4; స్మిత్‌ (సి) యాన్సెన్‌ (బి) మార్క్‌రమ్‌ 66; హెడ్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 11; వెబ్‌స్టర్‌ (సి) బెడింగ్‌హామ్‌ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్‌ 23; కమిన్స్‌ (బి) రబాడ 1; స్టార్క్‌ (బి) రబాడ 1; లయన్‌ (బి) యాన్సెన్‌ 0; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్‌) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్‌: రబాడ 15.4–5–51–5; యాన్సెన్‌ 14–5–49–3; ఇన్‌గిడి 8–0–45–0; ముల్డర్‌ 11–3–36–0; కేశవ్‌ మహరాజ్‌ 6–0–19–1; మార్క్‌రమ్‌ 2–0–5–1. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) స్టార్క్‌ 0; రికెల్టన్‌ (సి) ఖ్వాజా (బి) స్టార్క్‌ 16; ముల్డర్‌ (బి)కమిన్స్‌ 6; బవుమా (నాటౌట్‌) 3; స్టబ్స్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; బెడింగ్‌హామ్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్‌: స్టార్క్‌ 7–3–10–2; హాజల్‌వుడ్‌ 7–3–10–1; కమిన్స్‌ 7–3–14–1; లయన్‌ 1–0–1–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement