Asia Cup IND VS PAK Super 4 Match: ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్‌కు కోహ్లి మద్దతు

Asia Cup IND VS PAK Super 4 Match: Anyone Can Make Mistakes Under Pressure, Virat Kohli Supports Arshdeep Singh - Sakshi

పాకిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్‌ 4) జరిగిన హోరాహోరీ సమరంలో కీలక సమయంలో (15 బంతుల్లో 31 పరుగులు) సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచి, జట్టు పరాజయానికి పరోక్ష కారణమైన టీమిండియా యువ పేస్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌కు సహచర ఆటగాడు, జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మద్దతుగా నిలిచాడు. పాక్‌ చేతిలో ఊహించని పరాభవం ఎదురవడం, అందుకు అర్షదీపే కారణమని భావిస్తున్న జనం సోషల్‌మీడియా వేదికగా అతనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

అంత ఈజీ క్యాచ్‌ పట్టలేవా.. నీ వల్లే మ్యాచ్‌ చేజారిందని అర్షదీప్‌ను నిందిస్తున్నారు. ఎంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తే మాత్రం, గల్లీ క్రికెటర్లు పట్టే క్యాచ్‌లు కూడా పట్టలేవా అంటూ ఏకిపారేస్తున్నారు. క్యాచ్‌ జారవిడిచినందుకు అప్పుడే కెప్టెన్‌ రోహిత్‌చే చీవాట్లు తిన్ని అర్షదీప్‌.. మ్యాచ్‌ చేజారిన అనంతరం అభిమానులు ఆగ్రహావేశాలకు బలవుతున్నాడు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, సీనియర్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి అర్షదీప్‌కు మద్దతుగా నిలిచాడు.  

పాక్‌తో మ్యాచ్‌ అంటే ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనై తప్పులు చేస్తారని, అందుకు నేను కూడా అతీతుడ్ని కాదని, అర్షదీప్‌ జారవిడిచిన క్యాచ్‌ చాలా కీలకమే అయినప్పటికీ అతన్ని ఈ రేంజ్‌లో నిందించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ​మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లి ఈ మేరకు అర్షదీప్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. తప్పులను ఒప్పుకుని గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికాడు. జట్టులో సీనియర్లు, కెప్టెన్‌, కోచ్‌ అర్షదీప్‌కు అండగా ఉన్నారని, అతను అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు.  అర్షదీప్‌కు కోహ్లితో పాటు భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా మద్దతుగా నిలిచారు. 

వాస్తవానికి  ఆ ఒక్క డ్రాప్‌ క్యాచ్‌ మినహా బౌలింగ్‌లో అర్షదీప్‌ స్థాయికి మించి సత్తా చాటాడు. ఆఖరి ఓవర్లో పాక్‌ గెలుపుకు 7 పరుగులు కావాల్సిన తరుణంలో బంతినందుకుని ఆసిఫ్‌ అలీ వికెట్‌ పడగొట్టడంతో పాటు తొలి నాలుగు బంతుల్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు చిగురించేలా చేశాడు. అయితే ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఐదో బంతికి 2 పరుగులు రాబట్టి పాక్‌కు థ్రిల్లింగ్‌ విక్టరీని అందించాడు. 
చదవండి: Ind Vs Pak: ఏయ్‌.. నువ్వేం చేశావో అర్థమైందా అసలు? అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్‌
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top