పారిస్‌ను కాదని బ్రిస్బేన్‌లో...

Ashleigh Barty Watching Australian Football League With Beer Glass - Sakshi

ప్రేక్షకుల స్టాండ్‌లో.. చేతిలో బీర్‌ గ్లాస్‌తో...ఆవేశంగా పంచ్‌ విసురుతూ వీరాభిమానం ప్రదర్శిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..!  మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్, ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా అయినా యాష్లే బార్టీ ఉత్సాహమిది. కరోనా కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడలేనంటూ తప్పుకున్న ఆమె ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఏఎఫ్‌ఎల్‌)ను ప్రేక్షకురాలిగా ఎంజాయ్‌ చేస్తోంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల బార్టీ శుక్రవారం ‘గాబా’ స్టేడియంలో రిచ్‌మండ్‌ క్లబ్‌తో తలపడిన తన అభిమాన జట్టు బ్రిస్బేన్‌ లయన్స్‌కు మద్దతిస్తూ ఇలా కనిపించింది.

ఏథెన్స్‌ మారథాన్‌ రద్దు 
ఏథెన్స్‌: కరోనా వైరస్‌ దెబ్బకి మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌ రద్దయింది. మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఎంతో చరిత్ర ఉన్న ఏథెన్స్‌ మారథాన్‌ను ఈ ఏడాది నిర్వహించడం లేదంటూ గ్రీస్‌ ట్రాక్‌ సమాఖ్య (జీటీఎఫ్‌) పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 8న జరగాల్సిన ఈ పరుగును తక్కువ మంది అథ్లెట్లతో, పాల్గొనే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరమే నిర్వహించాలని జీటీఎఫ్‌ భావించింది. ఇందుకోసం అనుమతి కావాలంటూ గ్రీస్‌ ఆరోగ్య శాఖను కోరింది. అయితే వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు జీటీఎఫ్‌ తెలిపింది. మారథాన్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే రుసుము చెల్లించిన వారికి డబ్బును తిరిగి చెల్లించడమో లేదా వచ్చే ఏడాది ఈ రేసుకు అనుమతించడమో చేస్తామంది.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top