యాష్లే బార్టీ జోరు

Ash Barty fires into third round with win over Clara Tauson - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ

న్యూయార్క్‌: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్‌లో బార్టీ 6–1, 7–5తో క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో బార్టీ 11 ఏస్‌లు కొట్టి రెండు డబుల్‌ ఫాల్ట్‌లను చేయగా... క్లారా రెండు ఏస్‌లను సంధించి మూడు డబుల్‌ ఫాల్ట్‌లను చేసింది. ఆమెతో పాటు ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై, రెండో సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌) 6–3, 6–1తో తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై, 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్టీఫెన్స్‌ 6–4, 6–2తో కోకో గాఫ్‌ (అమెరికా)పై గెలుపొందారు.

సిట్సిపాస్, మెద్వెదేవ్‌ ముందంజ...      
పురుషుల విభాగంలో గ్రీస్‌ ప్లేయర్, మూడో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్, ఈ టోర్నీ రెండు సార్లు రన్నరప్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) మూడో రౌండ్‌లో ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సిట్సిపాస్‌ 3–6, 6–4, 7–6 (7/4), 6–0తో అడ్రియాన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ ఏకంగా 27 ఏస్‌లు సంధించాడు. మెద్వెదేవ్‌ 6–4, 6–1, 6–2తో డొమినిక్‌ కొఫెర్‌ (జర్మనీ)పై గెలిచి మూడు రౌండ్‌కు చేరుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top