మియామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 6-4, 6-3తో మూడో సీడ్ రిబాకినా (కజకిస్థాన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం రెండు సెట్లలోనే ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది.
గంటా 19 నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా 30 విన్నర్లు, 9 ఏస్‌లు సంధించగా.. రిబాకినా 2 ఏస్‌లు మాత్రమే సంధించి 15 విన్నర్లకే పరిమితమైంది. తొలుత మ్యాచ్‌లో రిబాకినా 3-1తో సబలెంకాపై ఆధిపత్యం కనబరించింది. కానీ వరుసగా రెండుసార్లు రిబాకినా సర్వీస్‌ను బ్రేక్ సఫలమైన సబలెంకా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
మరో సెమీఫైనల్లో అమెరికా నల్లకలువ కోకో గాఫ్ 6-1, 6-1తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ముచోవాను చిత్తుగా ఓడించి తుది పోరులో అడుగుపెట్టింది. రేపు జరగనున్న ఫైనల్లో సబలెంకాతో కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సబలెంకా మియామి ఓపెన్ ఫైనల్స్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. గతంలో రిబాకినా 2023, 2024లో వరుసగా ఫైనల్ చేరింది.
అంతకముందు సెరెనా విలియమ్స్ 2013 నుంచి 2015 మధ్య వరుసగా మియామి ఓపన్‌లో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. సబలెంకా, గాఫ్‌లు 2020లో తొలిసారి ఫైనల్లో ఎదురుపడ్డారు. ఆ తర్వాత జరిగిన పోరులో ఇద్దరు చెరో 6 విజయాలతో సమానంగా ఉన్నారు. గాఫ్ రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో సబలెంకాను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ గాఫ్ మూడు సెట్లలోనే సబలెంకాను ఓడించడం విశేషం.


