ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్‌లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 22 ఏళ్ల అక్షత్ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.
అక్షత్ ఐపీఎల్ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్‌కు ముందు రాబ్ క్వీని (రాజస్థాన్), కెవాన్ కూపర్ (రాజస్థాన్), ఆండ్రీ రసెల్ (కేకేఆర్), కార్లోస్ బ్రాత్‌వైట్ (ఢిల్లీ), అనికేత్ చౌదరి (ఆర్సీబీ), జేవన్ సీల్స్ (కేకేఆర్), సిద్దేశ్ లాడ్ (ముంబై), మహీశ్ తీక్షణ (సీఎస్‌కే), సమీర్ రిజ్వి (సీఎస్‌కే), వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్) ఈ ఘనత సాధించారు.
ఈ సీజన్ వేలంలో అక్షత్‌కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్ తన డెబ్యూ క్యాప్‌ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్ 2025 మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అప్పుడే కన్నేసింది.
అక్షత్‌కు దేశవాలీ క్రికెట్‌లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్ బాదిన అక్షత్ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (44), పూరన్ (63) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. మార్క్రమ్ (29), హిమ్మత్ సింగ్ (37) క్రీజ్‌లో ఉన్నారు.


