
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని ఆకాశ్ దీప్‌తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు. మహ్మద్ షమీ (Mohammed Shami) మాదిరి ఈ బెంగాల్ పేసర్ రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఓటమితో ఈ సిరీస్‌ను మొదలుపెట్టింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక బుమ్రాపై పనిభారం తగ్గించే నిమితం టీమిండియా మేనేజ్‌మెంట్ అతడిని ఇక్కడ కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడించనుంది.
షమీ మాదిరి ఆకట్టుకోగలడు
ఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘ఒకవేళ బుమ్రా గనుక ఈ టెస్టు ఆడకపోతే.. అతడి స్థానంలో సరైన బౌలర్ ఎవరంటే.. ఆకాశ్ దీప్. నెట్స్‌లో అతడి ప్రాక్టీస్ చూస్తుంటే.. షమీ మాదిరి ఆకట్టుకోగలడని అనిపిస్తోంది. సీమ్, స్వింగ్‌పై మరింతగా దృష్టి సారిస్తే.. కచ్చితంగా ఇంగ్లండ్ బ్యాటర్లను అతడు ఇబ్బందిపెట్టగలడు.
అర్ష్‌దీప్ వద్దు!.. బుమ్రా స్థానంలో అతడే సరైనోడు
అర్ష్‌దీప్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బుమ్రా ఒకవేళ రెండో టెస్టు ఆడకపోతే అతడి స్థానంలో ఆకాశ్ దీప్‌ను తప్పక ఎంపిక చేయాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు.
మరోవైపు.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి రావడం ఖాయమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అంటున్నారు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 2-6 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడి పదిహేను వికెట్లు తీశాడు. మరోవైపు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూసుకుపోతున్న అర్ష్‌దీప్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇక టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది.
భారత్‌తో రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
చదవండి: చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. వరల్డ్ చాంపియన్ చేతిలో జింబాబ్వే చిత్తు