Sakshi News home page

IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్‌ దీప్‌?

Published Fri, Feb 23 2024 9:32 AM

Akash Deep replaces Jasprit Bumrah, makes his Test debut in Ranchi - Sakshi

టీమిండియా తరపున అరంగేట్రం చేయాలన్న బెంగాల్‌ పేసర్‌ ఆకాష్‌ దీప్‌ కల ఎట్టకేలకు నేరవేరింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఆకాష్‌ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. నాలుగో టెస్టుకు స్టార్‌ పేసర్‌ బుమ్రా దూరం కావడంతో  ఆకాష్‌ దీప్‌కు తుది జట్టులో చోటు దక్కింది. భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల మీదగా ఆకాష్‌ తన తొలి టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 313వ ఆటగాడిగా ఆకాష్‌ నిలిచాడు.

కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఆకాష్‌ దీప్‌కు చోటు దక్కలేదు. అయితే దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆకాష్‌ ఇప్పుడు ఏకంగా భారత జెర్సీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.

ఆకాష్‌ ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికార టెస్టు సిరీస్‌లో కూడా ఆకాష్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన దీప్‌ 13 వికెట్లు పడగొట్టి.. భారత్‌-ఏ జట్టు తరపున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆకాష్‌ దీప్‌ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ ఆకాష్‌ దీప్‌..?
27 ఏళ్ల ఆకాష్ ఆకాష్‌ దీప్‌ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్‌ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్‌ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు.

ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్‌ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్‌ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్‌లోని ఓ క్రికెట్‌ ఆకాడమీలో దీప్‌ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్‌లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్‌ బాల్‌ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్‌ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్‌ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ డివిజన్‌ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్‌ లభించింది. ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్  డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్‌ దీప్‌ పడ్డాడు. ఆకాష్‌ దీప్‌ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు  కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు.

వెంటనే అండర్‌-23 కోచ్‌  సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్‌ దీప్‌ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి  బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్‌ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.

సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్‌ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్‌ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్‌ తరపున ఆకాష్‌ దీప్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

ఓవరాల్‌గా క్రికెట్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్‌ 103 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.  కనీస ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement