
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్లు బెక్ డకెట్ (Ben Duckett), జాక్ క్రాలీ సరికొత్త చరిత్ర లిఖించారు. భారత జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కారు. అదే విధంగా.. టీమిండియాపై టెస్టుల్లో అత్యధికసార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.
ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఓవల్ మైదానంలో గురువారం ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. 224 పరుగులకు ఆలౌట్ అయింది.
224 పరుగులకు టీమిండియా ఆలౌట్
వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38), ఐదో స్థానంలో ఆడిన కరుణ్ నాయర్ (57) తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ఐదు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ శుభారంభం అందించారు. డకెట్ 29, క్రాలీ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. టీమిండియాపై 936 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆండ్రూ స్ట్రాస్- అలిస్టర్ కుక్ జోడీని వీరు అధిగమించారు.
కుక్- స్ట్రాస్‌లను అధిగమించి..
కాగా డకెట్- క్రాలీ జోడీ టీమిండియాపై ఇప్పటికి ఓవరాల్‌గా 936 పరుగులు పూర్తి చేసుకోగా.. కుక్- స్ట్రాస్ కలిసి 20 ఇన్నింగ్స్‌లో 932 పరుగులు సాధించారు. అదే విధంగా.. అత్యధికంగా ఎనిమిదిసార్లు డకెట్- క్రాలీ 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. డకెట్ అర్ధ శతకానికి చేరువైన వేళ టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ అద్బుత డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. 38 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేసిన డకెట్.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మరోవైపు.. భోజన విరామ సమయానికి 16 ఓవర్ల ఆట ముగిసేసరికి క్రాలీ అర్ధ శతకం (52) పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ 12 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 109/1 (16). కాగా డకెట్-క్రాలీ కలిసి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించారు.
చదవండి: కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్