చరిత్ర సృష్టించిన ఆకాశ్‌ దీప్‌.. | Akash Deep Breaks India Record For Best Test Bowling Figures In England, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆకాశ్‌ దీప్‌..

Jul 7 2025 12:04 PM | Updated on Jul 7 2025 1:07 PM

Akash Deep Breaks India Record for best Test bowling figures in England

టీమిండియా స్టార్‌ ఆకాశ్‌ దీప్‌ (Akash Deep) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. స్టోక్స్‌ బృందంతో రెండో టెస్టు సందర్భంగా ఆకాశ్‌ దీప్‌ ఈ ఘనత సాధించాడు.

టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందకు భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఓడిన గిల్‌ సేన.. రెండో టెస్టులో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది.

336 పరుగుల తేడాతో గెలుపు
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌.. ఈ వేదికపై తొలిసారి టెస్టు గెలుపును రుచిచూసింది. అంతేకాదు పరుగుల తేడా పరంగా విదేశీ గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం మరో విశేషం.

ఇక చిరస్మరణీయ గెలుపులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)తో పాటు.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌లది అత్యంత కీలక పాత్ర. గిల్‌ డబుల్‌ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. భారత్‌ ఇంగ్లండ్‌ ముందు కొండంత లక్ష్యం (608) ఉంచడానికి దోహం చేశాడు.

పది వికెట్లతో మెరిసి
అయితే, వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ డ్రా కోసం ప్రయత్నిస్తుందేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆకాశ్‌ దీప్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 20 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చిన ఆకాశ్‌  నాలుగు వికెట్లు పడగొట్టాడు.బెన్‌ డకెట్‌ (0), ఓలీ పోప్‌ (0)లను డకౌట్‌ చేయడంతో పాటు.. ప్రమాదకర బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (158)తో పాటు క్రిస్‌ వోక్స్‌ (5) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బెన్‌ డకెట్‌ (25), ఓలీ పోప్‌ (24)ల పనిపట్టాడు ఆకాశ్‌. అంతేకాదు జో రూట్‌ (6), హ్యారీ బ్రూక్‌ (23), జేమీ స్మిత్‌ (88), బ్రైడన్‌ కార్స్‌ (38) వికెట్లను కూడా ఈ 28 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 21.1 ఓవర్ల బౌలింగ్‌లో 99 పరుగులు ఇచ్చిన ఆకాశ్‌ దీప్‌ ఇలా ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.

ఓవరాల్‌గా రెండో టెస్టులో మొత్తంగా 187 పరుగులు ఇచ్చి.. పది వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌ దీప్‌.. టీమిండియా తరఫున ఇంగ్లండ్‌ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు చేతన్‌ శర్మ పేరిట ఉండేది.

ఇంగ్లండ్‌ గడ్డ మీద టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే
🏏ఆకాశ్‌ దీప్‌- 2025లో బర్మింగ్‌హామ్‌ వేదికగా- 10/187 
🏏చేతన్‌ శర్మ- 1986లో బర్మింగ్‌హామ్‌ వేదికగా- 10/188
🏏జస్‌ప్రీత్‌ బుమ్రా- 2021లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా- 9/110 
🏏జహీర్‌ ఖాన్‌- 2007లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా- 9/134.

చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement