కోహ్లిని క్షమాపణ కోరాను: రహానే

Ajinkya Rahane Says He Apologised To Kohli Over Adelaide Run Out - Sakshi

సిడ్నీ: అడిలైడ్‌ టెస్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత తాను విరాట్‌ కోహ్లిని క్షమాపణ కోరినట్లు అజింక్య రహానే తెలిపాడు. ఇందుకు అతడు సానుకూలంగా స్పందించాడని పేర్కొన్నాడు. అయితే రనౌట్‌ తర్వాత మ్యాచ్‌ మొత్తం ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారిందని విచారం వ్యక్తం చేశాడు. గత అనుభవాల దృష్ట్యా తదుపరి మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. కాగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే నిలదొక్కుకోవడంతో కెప్టెన్‌ కోహ్లి, రహానే మధ్య  88 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కోహ్లి (180 బంతుల్లో 74) సెంచరీ దిశగా దూసుకెళుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లయన్‌ బౌలింగ్‌లో రహానే ఫ్లిక్‌ చేయగా మిడాఫ్‌లో ఉన్న హాజల్‌వుడ్‌ బంతిని లయన్‌కు అందించాడు. ఈ క్రమంలో రహానే కాల్‌తో అప్పటికే కోహ్లి.. సగం పిచ్‌ దాటేయగా లయన్‌ బంతిని నేరుగా వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో రహానేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.(చదవండి: జోరుగా భారత్‌ ప్రాక్టీస్‌)

ఈ విషయంపై తాజాగా స్పందించిన తాత్కాలిక కెప్టెన్‌ రహానే.. ‘‘ఆ రోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాను. మరేం పర్లేదు అన్నాడు. పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్న సమయంలో అలా జరిగింది. దాంతో మ్యాచ్‌ ఆసీస్‌ చేతిలోకి వెళ్లింది. అది నిజంగా కఠిన సమయం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మొదటి టెస్టులో  కోహ్లి సేన ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా.. 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ ముగించి విమర్శలు మూటగట్టుకుంది. ఇక పితృత్వ సెలవు తీసుకున్న కెప్టెన్‌ కోహ్లి స్వదేశానికి పయనం కావడంతో రహానే అతడి స్థానంలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టెస్టు కోసం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top