
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ కు కాదు ఏదీ అనర్హం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. ఇప్పటికే ఆన్ లైన్ నిశ్చితార్థాలు, ఆన్ లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూశాం. అయితే తాజాగా ఆన్ లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహా కుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్ లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే. మరికొందరు తమ బంధువులు ఎవరైనా అక్కడకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ తోనే పుణ్యస్నానం పూర్తి చేయిస్తున్నారు.
ఫోన్ ను నీటిలో ముంచి భర్తకు పుణ్య స్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్ పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ.. ఫోన్ ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది.