వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం బ్రహ్మశ్రీ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో వేదపండితులు స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. సామూహిక లక్షపుష్పార్చన చేశారు. కనుల పండువగా సాగిన ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొండపైన విద్యాసరస్వతి అమ్మవారిని, వివిధ దేవతామూర్తులను దర్శించుకున్నారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల విద్యార్థి అఖిల మొదటి స్థానంలో నిలిచింది. 9వ తరగతి విద్యార్థి అఖిల రాసిన మట్టి గణపతి అనే కథకు బహుమతి వచ్చింది. బాల చెలిమి పత్రిక హైదరాబాద్ వారు నిర్వహించిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 252 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో విజేతగా నిలిచిన అఖిలను పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు.
అదనపు సీనియర్ సివిల్ జడ్జి కుమారస్వామి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చిందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి కుమారస్వామి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి కుమారస్వామి మాట్లాడుతు విద్యార్థులు తమకు తెలియని వ్యక్తులతో తమ విలువైన సమాచారం పంచుకోవద్దన్నారు. విద్యార్థులతో ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


