గృహజ్యోతికి ‘ఎల్‌నినో’ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

గృహజ్యోతికి ‘ఎల్‌నినో’ షాక్‌

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

● తగ్గిపోతున్న లబ్ధిదారుల సంఖ్య ● సెప్టెంబర్‌లో జీరో బిల్లుకు 10వేల కుటుంబాలు దూరం

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం
● తగ్గిపోతున్న లబ్ధిదారుల సంఖ్య ● సెప్టెంబర్‌లో జీరో బిల్లుకు 10వేల కుటుంబాలు దూరం

సాక్షి, సిద్దిపేట: ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత.. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్షాకాలం ముగింపు దశలోనూ వాతావరణంలో వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు, కూలర్లు వినియోగించాల్సి వస్తోంది. ఫలితంగా ఇళ్లలో విద్యుత్‌ వినియోగం పెరిగి గృహజ్యోతి పథకం కుటుంబాలకు అదనపు భారం తప్పడం లేదు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించే ఈ పథకంలో.. వినియోగం పరిమితి దాటితే జీరో బిల్లు అందకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో సెప్టెంబరు నెలలో ఏకంగా 10,889 కుటుంబాలు జీరో బిల్లుకు దూరమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్‌ వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉక్కపోత తీవ్రత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అక్టోబరు రెండో వారంలోనూ వేడి తగ్గకపోవడంతో ఫ్యాన్లు, కూలర్లు నిరంతరం వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇళ్లలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. నెలవారీ వినియోగం 200 యూనిట్ల పరిమితిని దాటిన కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు పొందలేకపోతున్నాయి.

సెప్టెంబర్‌ నెలలో..

జిల్లాలో గృహజ్యోతి పథకం మార్చి–2024 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి సెప్టెంబరు నెలలో జీరో బిల్లులు పొందిన వారి సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఆ నెలలో మొత్తం 2,06,468 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. 1,95,589 మంది మాత్రమే జీరో బిల్లులు పొందారు. మిగిలిన 10,879 కనెక్షన్లకు జీరో బిల్లులు జారీ కాలేదు. అయితే,10,889 కుటుంబాలు జీరో బిల్లుకు దూరమయ్యారు.

సబ్సిడీ వ్యయంలోనూ రికార్డు!

గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీ వ్యయంలోనూ సెప్టెంబరు నెలలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గణాంకాల ప్రకారం.. ఆ నెలలో సుమారు రూ.7.98 కోట్ల సబ్సిడీ వినియోగదారులకు అందింది. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన నెలవారీ గణాంకాల్లో ఇదే అత్యధికం.

ఇలా చేస్తే మేలు...

ప్రజలు పాతకాలం నాటి ఫ్లోరోసెంట్‌ బల్బులు వాడటంతో కరెంట్‌ వినియోగం పెరుగుతుంది. వీటికి బదులు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లను వినియోగించడం మేలు. సీజన్‌ మేరకు ఫ్రీజ్‌లో ఫ్రీజర్‌ దశలు మారుస్తూ ఉండాలి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్లులు, రిఫ్రిజిరేటర్లు లు బీఈఈ రేటింగ్‌ 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిలో 5స్టార్‌ ఉంటే విద్యుత్తు వినియోగం తగ్గడంతో బిల్లు ఆదా అవుతుంది.

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి

గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించిన వారే జీరో బిల్లుకు అర్హులు. 200 యూనిట్ల వినియోగం దాటితే ఆ నెల మాత్రమే జీరో బిల్లు వర్తించదు. వచ్చే నెల 200 యూనిట్ల లోపు వినియోగిస్తే మళ్లీ జీరో బిల్లు వర్తిస్తుంది. అందరూ విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి.

– చంద్రశేఖర్‌, ఎస్‌ఈ, టీజీ ఎస్పీడీసీఎల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement