హుస్నాబాద్: విజయదశమి స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద రాంలీలా కార్యక్రమంలో పాల్గొని రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ –3 పనులకు ప్రభుత్వం రూ.211 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపిందన్నారు. కాలువల పటిష్టత, సీసీ లైనింగ్ పనులకు అదనంగా రూ.40 కోట్లతో కొత్త టెండర్లకు అనుమతి ఇచ్చిందన్నారు. దీని ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం, 22 గ్రామాల్లో 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో వైద్య, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అర్బన్ ఫారెస్ట్ పార్క్, అవసరమైన అభివృద్ది పనులు పూర్తి చేసి ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి అన్ని రంగాల్లో మరిన్ని అవకాశాలు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఇంటింటా ఆనందం వెల్లివిరియాలి
విజయ దశమి సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, సతీమణి మంజుల సంప్రదాయబద్దంగా శమీ పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలు, కాన్వాయ్ వాహనాలకు పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించనట్లు తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
వైభవంగా దసరా వేడుకలు


