సాక్షి, సిద్దిపేట: కుష్ఠు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సమరం చేస్తోంది. ఇది ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కల్గించగల మహమ్మారి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్ కుష్ఠు వ్యాధి లక్షణాలు కల్గిన వారి వివరాలను సేకరించేందుకు సంకల్పించింది. 2030 వరకు వ్యాధి కేసులను జీరోకు తగ్గించాలని ఏటా ఇంటింటి సర్వే చేస్తోంది. ఇందులో భాగంగా 14 రోజుల పాటు ఇంటింటా లెప్రసీ(కుష్ఠు) సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. గురువారం నుంచి 4 నవంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య బృందాలు సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వే అనంతరం లక్షణాలు ఉన్న వారికి మందులు ఇస్తూ తరుచుగా వారిని పరీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సర్వేలో ఆరోగ్య పర్యవేక్షకులు 273 మంది పర్యవేక్షణలో 822 ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వేను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి కుష్ఠు వ్యాధిగ్రస్తులు 51 మంది ఉన్నారు.
అరికట్టడం సులువే..
కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే దానిని అరికట్టడం చాలా సులువు. కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పటికీ బయటివారు ఏమకుంటున్నారో అనే న్యూనతాభావంతో బయట కు చెప్పుకోవడం లేదు. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతోంది. తీవ్రత పెరిగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కాళ్లు, చేతుల వేళ్లు ముడుచుకుపోవడం, కుచించుకుపోవడం, చేతులు, కాళ్లలో సత్తువ కోల్పోయి వాలిపోవడం జరుగుతుంది. ఇది శాశ్వత వైకల్యానికి దారి తీస్తుంది. వ్యాధిని గుర్తించి మందులు వాడితే 6 నెలల నుంచి ఏడాది వరకు పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మచ్చలుంటే చెప్పాలి
శరీరం పై స్పర్శలేని మచ్చలు లేదా కాళ్లు చేతులలో తిమ్మిర్లు, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి చెప్పాలి. ఆశ్రద్ధ చేస్తే అంగవైకల్యం సైతం ఏర్పడవచ్చు. ఎలాంటి అపోహలకు గురికావద్దు ఈ సర్వేకు ప్రజలు అందరూ సహకరించాలి. ఈ సర్వే 14 రోజుల పాటు కొనసాగనుంది.
–డాక్టర్ ధనరాజ్, డీఎంహెచ్‌ఓ
నిర్మూలనే లక్ష్యంగా నేటి నుంచి ఇంటింటి సర్వే
వ్యాధిగ్రస్తులను గుర్తించి మందుల పంపిణీ
సర్వేలో 822 ఆశాకార్యకర్తలు


