● పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్
● కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సిద్దిపేటకమాన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్తూపానికి సీపీ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ రోజూ 24 గంటలు పని చేసే విభాగమని, పండుగలు సెలవులు అనే తేడా లేకుండా సిబ్బంది నిరంతరం ఆన్ డ్యూటీ లో ఉంటూ ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి త్యాగాలను డిపార్ట్‌మెంట్ ఎప్పటికీ మర్చిపోదన్నారు. పోలీస్ కుటుంబాలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ ప్రత్యేకంగా మాట్లాడి కుటుంబ పరిస్థితిలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించి జ్ఞాపికలను అందజేశారు. అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఇప్పటివరకు ఏడు మంది పోలీసు అధికారులు, సిబ్బంది అమరులయ్యారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


