కొండపాక(గజ్వేల్): ఉద్యోగులు, ప్రజలు పట్నం బాట పట్టడంతో బుధవారం టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ కొనసాగింది. అత్యంత వైభవంగా జరుపుకొనే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మూడు నాలుగు రోజుల కిందట హైదరాబాద్ తదితర పట్టణాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. పండుగలను జరుపుకొని తిరిగి వాహనాల్లో బయలు దేరి వెళ్తున్నారు. టోల్ ప్లాజా నిర్వాహకులు హైదారాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రద్దీ పెరగకుండా చర్యలు చేపట్టారు.


