సిద్ధిదాత్రి.. సింహవాహిని | - | Sakshi
Sakshi News home page

సిద్ధిదాత్రి.. సింహవాహిని

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

●మహిషాసుర మర్దినిగా వర్గల్‌ అమ్మవారు ●నేత్రపర్వంగా అష్టోత్తరశత కలశాభిషేకం

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధ వర్గల్‌ విద్యాధరి క్షేత్రం మహర్నవమి వేడుకలతో శోభిల్లింది. అష్టోత్తర శతకలశాభిషేకం నేత్రపర్వం చేసింది. ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం శ్రీవిద్యా సరస్వతి అమ్మవారు సింహవాహిని, మహిషాసుర మర్దినిగా భక్తజనావళికి దర్శనమిచ్చారు. బ్రహ్మశ్రీ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు ఆలయ మహామండపంలో అష్టోత్తర శత కలశాలు, శంఖువులు స్థాపన చేసి కలశ పూజ నిర్వహించారు. అనంతరం పూర్ణ కలశంతో అమ్మవారి మూలవిరాట్టుకు మహా కలశాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం విశేషాభరణాలు, పట్టువస్త్రాలు, పూలమాలలతో సర్వాలంకార శోభితులైన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దివ్యదర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎఫ్‌డీసీ మాజీ చైర్మెన్‌ ప్రతాప్‌రెడ్డి కలశపూజలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి వైభవం తిలకించి తరించారు.

నేడు దసరామహోత్సవం

మంగళవారం దసరా మహోత్సవం సందర్భంగా ఉదయం విశేషాభిషేకాలు, 8 గంటలకు శమీపూజ, అమ్మవారి విజయ దర్శనం ఉంటుంది.

మహిషాసుర మర్దినిగా విజయదుర్గమ్మ

కొండపాక(గజ్వేల్‌): మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్దినిగా దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కలశ స్థాపన, చతుషష్ట్య ఉపచార, తదితర విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement