ఎల్‌నినో తెచ్చిన విపత్తి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో తెచ్చిన విపత్తి

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

● సగటున 34 నుంచి 55 శాతం తగ్గిన దిగుబడి

● ఎకరానికి ఐదు క్వింటాళ్లు కూడా రావడం లేదంటున్న రైతులు

● ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వ్యవసాయశాఖ

● షురూ అయిన పత్తి తీత

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి పత్తి దిగుబడులు భారీగా పడిపోయాయి. సారవంతమైన నల్లరేగడి భూములో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు వచ్చే పంట ఆరేడు క్వింటాళ్లకే పరిమితమైంది. వ్యవసాయ శాఖ మాత్రం కనిష్టంగా 34 శాతం నుంచి గరిష్టంగా 55 శాతం వరకు తగ్గినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారంగా వచ్చే దిగుబడి కంటే గరిష్టంగా 4.5 క్వింటాళ్లు దిగుబడి తగ్గినట్లు తేల్చింది. ఎకరానికి సగటున తొమ్మిది క్వింటాళ్లు రావాల్సిన చోట కేవలం నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమైందని చెప్పింది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన పంట నష్టంపై ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం.. వాతావరణ పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు దిగుబడులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేరకు వర్షాలు సరిగ్గా కురియలేదు. ఎండల తీవ్రతకు పత్తి కాయలు రాలిపోయి దిగుబడులపై ప్రభావం చూపింది. కాగా గత ఏడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్ట పోగా.. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పత్తి తీత ముమ్మరం

రాష్ట్ర వ్యాప్తంగా పత్తిని ఏరడాన్ని రైతులు ముమ్మరం చేస్తున్నారు. వారం రోజులుగా పత్తిని తీస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు పత్తిని తీసే వారు. కొన్ని సంవత్సరాలుగా ఒకేసారికి పరిమితమైంది. పత్తి ఏరేందుకు కూలీలు సరిగా రావడం లేదు. కిలో పత్తి తీస్తే కూలీలకు రూ.12 చొప్పున చెల్లిస్తున్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉన్న చోట కిలోకు రూ.20 వరకు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కేవలం పత్తి తీయడానికి క్వింటాల్‌కు రూ.1200 నుంచి రూ.రెండు వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement