గజ్వేల్‌రూరల్: ఆహారాన్ని అవసరానికి తగినంత మాత్రమే వండుకోవాలని, మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం సభ్యులు అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(పల్లెపహాడ్)లో శుక్రవారం అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఓ వైపు ప్రజలు ఆహారం లేక ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ఆహారాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రోత్సహిస్తూ, ప్రకృతికి అనుకూలమైన సుస్థిర వ్యవసాయ పద్దతులను అనుసరించడం వల్ల భవిష్యత్ తరాలకు సరిపడ ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.


