రూ.140 కోట్ల పనులకు టెండర్ దశలోనే నిలుపుదల
● మార్చిలో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ● ముగ్గురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేసినా.. రద్దు ● మరిన్ని కాలనీల్లో విస్తరించాలని పలువురు వినతులు
సిద్దిపేట పట్టణంలో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనులకు మరోసారి
బ్రేక్ పడింది. పట్టణ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.140 కోట్లతో చేపట్టేందుకు మార్చిలో నర్మెటలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని పట్టణ ప్రజలు ఆశించారు.
ఇటీవల పనులకు టెండర్లు పిలవగా ముగ్గురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే అధికార పార్టీనేతల సంబంధికులు టెండర్లు దాఖలు చేయలేదని ప్రక్రియను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షి, సిద్దిపేట
సిద్దిపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం అమృత్ ఫేస్–1,2లతోపాటు టీయూడీఎఫ్‌డీసీ ద్వారా మొత్తం రూ 301.81కోట్లు మంజూరు కాగా 324 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం, రెండు ఎస్‌టీపీలను నిర్మించారు. అసంపూర్తిగా ఉన్న యూజీడీ నిర్మాణం కోసం యూఐడీఎఫ్ నుంచి రూ.140 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్త కాలనీలలో, అలాగే పలు కాలనీల్లో వదిలేసిన ఎండింగ్ పాయింట్‌లను కొనసాగింపుగా 155 కిలోమీటర్ల పైప్‌లైన్, మూడు ఎస్‌టీపీలు నిర్మించాలని నిర్ణయించారు. యూజీడీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలలో అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నిర్ణీత గడువులో ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉండగా..అనూహ్యంగా టెండర్‌ను రద్దు చేసినట్లు తెలిసింది.
‘రాజకీయ’ కారణాలపై చర్చ
టెండర్ ప్రక్రియ నిలిచిపోవడానికి రాజకీయ కారణాలున్నాయనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇద్దరు మంత్రుల సంబంధికులు టెండర్లు దాఖలు చేయలేదనే కారణంతోనే ప్రక్రియను నిలిపివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల స్వంత లాభం కోసం ప్రజలను ఇబ్బందుల ను గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రజలకు తప్పని నిరీక్షణ
మురుగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలకు యూజీడీ పూర్తయితే ఉపశమనం లభించే అవకాశం ఉంది. రూ.140 కోట్ల భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి దాదాపు 6 నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టెండర్ రద్దుకు కారణాలేమిటి? కొత్తగా ఎప్పుడు టెండర్లు పిలుస్తారు? ప్రాజెక్టులోకి చేర్చనున్న గ్రామాలెన్ని? అన్న అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రాజకీయ ఒత్తిడులు పక్కన పెట్టి పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
మరింత విస్తరించాలని వినతి
యూజీడీని మరింత విస్తరించాలని పలువురు వినతి పత్రాలను అందజేశారు. ఏ కాలనీలు, గ్రామాలు కలిపితే త్వరలో ఇబ్బందులు రాకుండా ఉంటాయనే వివరాలతో ఈఎన్‌సీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడ అనుమతులు రాగానే రీ ఎస్టిమేషన్ వేసి టెండర్లను ఈఎన్‌సీ పిలువనున్నారు. –మధుసూదన్, ఈఈ,
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్


