అక్రమ నిర్మాణాలపై మౌనమేల? | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై మౌనమేల?

Sep 20 2026 7:42 AM | Updated on Sep 20 2026 7:42 AM

బహుళ అంతస్తుల నిర్మాణాలపైనా..

నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు ఏవీ? పాలకవర్గం, అధికారుల మధ్య సమన్వయ లోపం పాలనతీరుపై విమర్శల వెల్లువ కలెక్టర్‌ చొరవ చూపాలని ప్రజల వేడుకోలు

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ నూతన పాలకవర్గం కొలువుదీరిన నాటి నుంచి మున్సిపల్‌లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. అధికారులు, పాలకవర్గం మధ్య సమన్వయం లోపించడం వల్లే మున్సిపల్‌ పాలన గాడితప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమన్వయ లోపం వల్లే తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు

అనుమతులు లేకుండా.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడంపై చర్చనీయాంశమైంది. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కొన్నిసందర్భాల్లో మౌనం వహించడం, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

చర్చనీయాంశంగా ప్రహరీ నిర్మాణం

ఇటీవల పట్టణ కేంద్రంలో చేపట్టిన ఓ ప్రహరీ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా బీటీ రోడ్డు పక్కన నిర్మిస్తున్న ఒక భవనాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. కానీ కూల్చివేసిన చోట అదే రోజు తిరిగి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడంపై తీవ్రవిమర్శలకు దారితీసింది. ఒక్కసారి అక్రమమని భావించి కూల్చిన గోడ తిరిగి అదేచోట ఎలా నిర్మిస్తారని? నిబంధనలకులోబడి చేసిన నిర్మాణాన్ని అధికారులు అవగాహన రాహిత్యంతో కూల్చివేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పట్టణ కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతి తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా సంబంధిత యజమానులకు నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.

కానరాని చర్యలు

గత పాలకవర్గం సమయంలో అప్పటి అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు అనుమతులు లేని పలు బహుళ అంతస్తులను కూల్చివేశారు. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ పట్టణ కేంద్రంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధికారులు, పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి

పట్టణంలో చేపట్టిన కొన్ని నిర్మాణాల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌, సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement