జీఓ 97 రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ నాయకుల ఆందోళన
కలెక్టరేట్ చాంబర్ ఎదుట విద్యార్థులు, బీఆర్‌ఎస్‌వీ నాయకుల బైఠాయింపు..
సిద్దిపేటరూరల్: పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ 97 రద్దు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ఎదుట మొదట ధర్నా చేపట్టిన విద్యార్థులు, నాయకులు.. ఆ తరువాత గేట్‌పైకి ఎక్కడం, తోసుకుంటూ కలెక్టరేట్ చాంబర్ వద్దకు పరుగులు పెట్టారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. కలెక్టర్ చాంబర్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీపీ కుశాల్కర్ చేరుకుని వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి నిరసనను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జీఓ 97తో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు యాదగిరి, శ్యామ్, ప్రశాంత్, రమేశ్, మాధవ్, శేఖర్, రమేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.


