ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రైతుల నుంచి రూ.1.57 కోట్లు అదనపు వసూళ్లు
బ్యాంకు నిర్వహణ పేరుతో నిధులు స్వాహా!
గత పాలకవర్గం నేత, బదిలీపై వెళ్లిన ‘ముఖ్య’అధికారి కలిసి దందా!
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వ్యవహారం
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతలను నిండా ముంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ డీసీసీబీల్లో లేనివిధంగా పంట రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ చార్జీల పేరుతో ఏకంగా రూ.1.57 కోట్లు వసూలు చేసేశారు. ఈ డబ్బును నిర్వహణ ఖర్చుల పేరుతో స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకవర్గంలో ఓ కీలక నాయకుడు, ఏళ్ల తరబడి బ్యాంకులో పాతుకుపోయి..ఇటీవల బదిలీ అయిన ఓ ‘ముఖ్య’అధికారి కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలపై అదనపు భారం మొపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ఉన్న డీసీసీబీల్లో లేనివిధంగా ఇక్కడ ఈ అదనపు చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7% వడ్డీని వసూలు చేయాలి. కానీ ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు అదనంగా 1% ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేశారు. అంటే రూ.లక్ష రుణం తీసుకున్న రైతు రూ.7వేల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యిమంది రైతుల వద్ద ఈ అనధికారిక వసూళ్ల దందా సాగింది. అన్నదాతలను నిండా ముంచేశారు.
రైతులు తిరగబడటంతో వెనక్కి!
అమాయక రైతులు, నిరక్షరాస్యుల వద్ద వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. కానీ కాస్త చైతన్యం ఉన్న రైతులు ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించారు. ఎక్కడా లేనిది అదనంగా చార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. దీంతో దాదాపు నాలుగు నెలలపాటు సాగిన ఈ వసూళ్ల దందాను గుట్టు చప్పుడు కాకుండా నిలిపివేశారు. రైతుల వాటాధనంగా నడుస్తున్న ఈ బ్యాంకు అదే రైతులకు ఇచ్చే పంట రుణాలపై అదనపు వసూళ్లు చేసి వారిని నిండా ముంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ముగిసిన పాలకవర్గం తీర్మానాలు
ఈ అదనపు చార్జీల వసూళ్లకు మేనేజింగ్ కమిటీ (ఎంసీ) తీర్మానాలున్నాయని డీసీసీబీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ బ్యాంకు మేనేజ్‌మెంట్ కమిటీ (పాలకవర్గం) పదవీకాలం 2025 ఫిబ్రవరిలోనే ముగిసింది. కానీ అదనపు వసూళ్లకు 2025 జూన్ 12న తీర్మానం చేశారు. అంటే పదవీకాలం ముగిన పాలకవర్గం తీర్మానం ఎలా చెల్లుతుందో అధికారులకే తెలియాలి. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం వారి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారని డీసీసీబీ అధికారులు చెబుతున్నారు. పొడిగించిన ఈ తాత్కాలిక పాలకవర్గానికి రైతులపై భారం మోపే తీర్మానాలు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. 2025 జూన్ 12 నుంచి 2025 అక్టోబర్ 8 తేదీ వరకు ఈ రూ.1.57 కోట్లు వసూళ్లకు తెగబడ్డారు. రైతులు తిరగబడకపోతే ఈ వసూళ్ల దందా మరింత సాగే అవకాశాలుండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా బ్యాంకు తీర్మానాలు చేసిన రైతులందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. కానీ వసూళ్ల తీర్మానాలను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్క్యూలర్లు ఇచ్చేశారు.
ఎంత లాభాలుంటే అంత స్వాహా
బ్యాంకుకు ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంతే మొత్తంలో స్వాహా చేయవచ్చనే ఈ అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ డబ్బులు చాలా మట్టుకు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలు ఇదే బ్యాంకులో పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’అధికారి, గత పాలకవర్గంలోని కీలక నాయకుడు కలిసి చేసిన ఈ స్వాహా పర్వంలో గత పాలకవర్గంలోని మరికొందరికి వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి.
రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గుట్టుగా నిలిపివేత


