● కలెక్టర్ హైమావతి ● పాఠశాల, కళాశాలల ఆకస్మిక తనిఖీ
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురైతే సహించేది లేదని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శనివారం చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను ఆమె ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆమె పరిశీలించారు. కూరల్లో మరింత నాణ్యత మెరుగు పరిచేలా పాటు పడాలన్నారు. వంట గది అపరిశుభ్రంగా ఉండటాన్ని పరిశీలించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజనం ఎలా ఉందనీ, మెనూ ప్రకారం పెడుతున్నారా, రుచిగా ఉంటుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రోగులకు మెరుగైన సేవలను అందించాలి
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కింది స్థాయి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మిరుదొడ్డిలోని పీహెచ్‌సీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్, ల్యాబ్, ఓపీ, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ నుండి, కింది స్థాయి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యం అందుతున్న విధివిధానాలపై రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు ధీర్ఘకాలిక వ్యాధులకు గురైతే అందుబాటులో ఉన్న యునానీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


