అభివృద్ధి చేసింది మేమంటే మేమే..
పార్టీ కార్యాలయాల వద్ద
పోలీసుల మోహరింపు
ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లు
అభివృద్ధి పనులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తమ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఇరు పార్టీల నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు చేపట్టగా.. పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
– సాక్షి, సిద్దిపేట
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సిద్దిపేట నియోజకవర్గానికి అధికంగా నిధులు వచ్చాయి. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదు. దీనిపై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని’ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సవాల్ విసిరారు. ఈ చర్చకు నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ సైతం వస్తారని పేర్కొన్నారు.
గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ సవాళ్లతో పలు మార్లు ఉద్రిక్త వాతవరణం నెలకోంది. దీంతో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సైతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు అత్తు ఇంటికి ఉదయమే పోలీసులు చేరుకున్నారు. అత్తును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎవరు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.
ఏ మంత్రి వస్తారో రండి..
‘చర్చకు ఎండిపోయిన రంగనాయకసాగర్ వద్దకు ఏ మంత్రి వస్తారో రండి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి’ అని బీఆర్‌ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆరోపించారు. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల రద్దు, కోమటి చెరువు దగ్గర శిల్పారామం, చిన్నకోడూరు రహదారి, కాళేశ్వరం నుంచి నీళ్లు పంపింగ్ చేయకపోవడంతో రంగనాయకసాగర్ ఎండిపోతుందని బీఆర్‌ఎస్‌వీ నేతలు పేర్కొంటున్నారు. దీనిపై చర్చకు ఎవరు వస్తారో రావాలని యువజన నాయకులు సాయిప్రేమ్, యాదగిరి, రమేష్, శేఖర్‌లు సవాల్ విసిరారు. దీంతో శనివారం ఉదయమే బీఆర్‌ఎస్ యువజన, విద్యార్థి నాయకులు అందరూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రంగనాయకసాగర్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.


