బ్రహ్మాండనాయకుడి వైభవం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండనాయకుడి వైభవం

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

ఘనంగా శ్రవణ నక్షత్ర మహోత్సవం

వర్గల్‌(గజ్వేల్‌): శుభకర శ్రావణ మాస వేళ బుధవారం వర్గల్‌ క్షేత్రంలో వేంకటేశ్వరుని జన్మ నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రవణ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతులై కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామివారి మూలవిరాటుకు విశేషాభిషేకం నిర్వహించారు. పూలమాలికలు సర్వాభరణాలతో కమనీయంగా అలంకరించారు. లక్ష తులసి అర్చన, విశేష పుష్పార్చన, పారాయణాది పూజలు జరిపారు. శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. మహాప్రసాదం స్వీకరించారు.

అంగన్వాడీ టీచర్‌కు

సేవారత్న అవార్డు

దుబ్బాక: సామాజిక సేవకురాలు, అంగన్వాడీ టీచర్‌ మహ్మద్‌ సుల్తాన ఉమర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో న్యూలైఫ్‌ థియాలాజికల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఆఫ్‌ సోషల్‌ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్‌తో పాటు మధర్‌ థెరిస్సా సేవారత్న అవార్డు, బంగారు పతకం అందజేశారు. రాయపోల్‌ మండలం ఇందుప్రియాల్‌కు చెందిన సుల్తాన ఉమర్‌ దశాబ్ద కాలంగా పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంగన్వాడీ టీచర్‌గా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్‌తో పాటు మధర్‌ థెరిస్సా అవార్డు రావడంపై తనపై మరింతగా బాధ్యత పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యులు డాక్టర్‌ రోనాల్డ్‌జాన్‌, డాక్టర్‌ జీవన్‌ తదితరులు ఉన్నారు.

హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెండి

హరీశ్‌రావుకు ముదిరాజుల వినతి

సిద్దిపేటజోన్‌: హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముదిరాజ్‌ హక్కుల సాధన సమితి నాయకులు మాజీమంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంఘం నాయకులు కలిసి సమస్యలు వివరించారు. ముదిరాజ్‌ హక్కులపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని సీఎం రేవంత్‌ ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీ అమలు అయ్యిందని, నేటి కాంగ్రెస్‌ హయాంలో పథకం నిర్వీర్యంగా మారిందన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా అసెంబ్లీలో ముదిరాజ్‌ల తరపున గళం విప్పాలని కోరారు. కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్‌, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు

అండగా కాంగ్రెస్‌

చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ అన్నారు. మండల పరిధిలోని చంద్లాపూర్‌లో బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, డైరెక్టర్లు, నాయకులు చిరంజీవి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement