● వచ్చే నెల 10 వరకు అవకాశం
● జిల్లాలో 70 వేల ఎకరాల్లో
సన్నాల సాగు
నారాయణఖేడ్: సన్నవడ్ల సాగుకు సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చెల్లించే బోనస్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకువచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కొత్తగా విధించిన నిబంధన క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయం, ఆందోళనకు గురిచేస్తుంది. సాగు చేసిన విత్తనాల వివరాలను విత్తన దుఖాణాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనే షరతును విధించింది. దీంతో ఇప్పటికే వానాకాలం పంట సాగు చేసిన రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఏడు రకాల విత్తనాలకే ఈ బోసన్ వర్తిస్తుంది. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి డీలర్ల వద్దకు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ పేర్కొంది. సెప్టెంబరు 10వ తేదీలోపు ఈ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లాలో ఈ ఏడాది వానాలంలో 1,28,967 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఇందులో దాదాపు 65 వేల నుంచి 70 వేల ఎకరాల్లో రైతులు సన్నవడ్లను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
ఏడు రకాలకే బోనస్
ప్రభుత్వం ఈ ఏడాది ఏడు రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. అందులో ఆర్‌ఎస్‌ఆర్ 15048 (తెలంగాణ సోనా), కేఎన్‌ఎం 1638 (కూనారకం వరి–2), జై శ్రీరామ్, కేఎస్‌ఎం 7715, బీపీటీ 5204 (సాంబ మసూరు), హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ది) ఉన్నాయి. కాగా రైతులు సీజన్ కోసం నెల రోజుల క్రితమే విత్తనాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం బోనస్ కావాలంటే కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను సదరు దుకాణంలో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. బోనస్ పొందాలంటే విధిగా విత్తన కొనుగోలు బిల్లు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకంతో సంబంధిత విత్తన దుకాణానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నమోదు సమాచారం ఆధారంగానే క్షేత్రస్థాయి పంటల నమోదు జరుగుతుందని, లేని పక్షంలో బోనస్ దక్కదనే సంకేతాలు ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎరువుల కోసం ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరో తలనొప్పిగా పరిణమించింది. నిబంధనలు వెలువడగానే రైతులు గ్రామాల నుంచి మండల కేంద్రాల్లోని విత్తనాల దుకాణాలకు పరగులు పెడుతున్నారు.


