● డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ● ఆహ్మదీపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం
గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షు రాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని 55 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి రూ.5.50 కోట్లు, సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి రూ.5.41 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీ, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ లాంటి కార్యక్రమాలు గొప్ప మార్పునకు నాందిపలికాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, నాయకులు అంజాగౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.


