ములుగు(గజ్వేల్): మండలంలోని తున్కిబొల్లారం గ్రామంలో జరగనున్న బాల్యవివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాలికకు పెళ్లి నిశ్చయమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రజిత, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్నతనంలోనే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలు, చట్టాల గురించి వివరించారు.
మెనూ ప్రకారం భోజనం తప్పనిసరి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్‌భార్గవ్
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్‌భార్గవ్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. వంట గదితో పాటు తదితర పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. పాఠశాల ఆవరణంలోని వరండాతో పాటుగా పరిసరాలను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. భోజనంతో పాటు తదితర సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్‌చైర్మన్ ఐల్లయ్య, ఆత్మకమిటీ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఏపీఓ ప్రభాకర్, ప్రత్యేక అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం
సిద్దిపేటకమాన్: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య విభజన సృష్టించే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాలను ఎలా పంచుతారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ ఐక్యంగా స్పందించి శాంతియుత పోరాటానికి సిద్ధం కా వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సతీష్, శ్రీనివాస్, బాలరాజ్, కిరణ్ పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో
సాగు లాభదాయకం
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
కొండపాక(గజ్వేల్): యాజమాన్య పద్ధతులతో సాగు లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి అన్నారు. ఈ మేరకు వ్యవసాయ సాగు విషయాల్లో రైతులకు అవగాహన కల్పిండంలో భాగంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని కుకునూరుపల్లి మండలం మేదినీపూర్‌లోని రైతు వేదిక ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల వ్యవసాయాన్ని చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేలా సలహాలు సూచనలు అందించనున్నట్లు తెలిపారు. మోతాదుకు మించి యూరియాను ఉపయోగించడ వల్ల ఎక్కువ శాతం తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందన్నారు.


