మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణ ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మిరుదొడ్డి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రకారం ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పింఛన్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని తెలంగాణ ఉద్యమకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేశారు. కార్యక్రమంలో టీయూ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, సూకూరి లింగం, వల్లాల సత్యనారాయణ, పూడూరి శ్రీనివాస్, కాలేరు శ్రీనివాస్, కోల విజయ్, నర్సింహులు, మల్లేశం, రమేష్ గౌడ్, మల్లయ్య, స్వామి, రమేష్, శంకర్, రవి, భిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.


