వాంకిడి టూ ఎర్రవల్లి
సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఎర్రవల్లి బాట పట్టారు. ఆసిఫాబాద్ జల్లాలోని వాంకిడి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గురువారం ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలవగా వారిని సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. వారి నిస్వార్థ సంకల్పానికి అధినేత భుజం తట్టి అభినందించారు. వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి (ఆటో డ్రైవర్), దుర్గం శంకర్ (హోటల్ కార్మికుడు) అనే ఇద్దరు గిరిజన ఆదివాసీ బిడ్డలు, కేసీఆర్ పె ఉన్న అభిమానంతో ఈ పాదయాత్ర చేపట్టారు. రోజుకు సగటున 25 కిలో మీటర్ల చొప్పున 11 రోజులుగా పాదయాత్రగా కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని,. అప్పుడు తప్పకుండా తనను వచ్చి కలవండి అని కేసీఆర్ చెప్పారు. అనంతరం వారికి కేసీఆర్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయగా, తిరిగి సొంత ఊరికి బయలు దేరి వెళ్లారు.
చౌడారంలో మద్య నిషేధం
గ్రామస్తుల తీర్మానం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చౌడారంలో మద్యం అమ్మవద్దని, మద్యం తాగవద్దని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం తీర్మానం చేశారు. ఆ పత్రాన్ని ఎకై ్సజ్ సీఐకి, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్‌కు అందజేశారు. గ్రామంలో మద్యం విక్రయించే వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాసుదేవాచారి మాట్లాడుతూ గ్రామంలో మద్యం అమ్మితే రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గ్రామస్తుల బాగుకోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.
జానపద కళల అకాడమీ ఏర్పాటు చేయాలి
హుస్నాబాద్: తెలంగాణ జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని సకల కళల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రపంచ జానపద దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న సిద్దిపేటలో జిల్లా సకల కళల జేఏసీ కళాకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడటం, కళాకారుల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వీరస్వామి, జగదీశ్వర చారి, ఎర్రంరాజు దేవరాజ్, బత్తుల చంద్రమౌళి, ముక్కెర సంపత్ తదితరులు ఉన్నారు.
చట్టాలపై
అవగాహన అవసరం
సిద్దిపేటఎడ్యుకేషన్: చట్టాలను గౌరవించాలని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్‌కుమార్, ఏఎస్‌ఐ కిషన్‌లు విద్యార్థినులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో షీటీమ్ ఆధ్వర్యంలో గురువారం ‘ఫర్ యూ.. విత్ యూ..’ అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమకు తాముగా సొంత రక్షణ కల్పించుకోవాలన్నారు. విద్యార్థినులు, మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటు, చదువులో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్వేత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ స్రవంతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సువర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు.


